Home> అంతర్జాతీయం
Advertisement

పసివాళ్ల కోసం కన్నీళ్లుపెడుతున్న సోషల్ మీడియా..'ప్రే ఫర్ సిరియా'

తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు సిరియాలో జరుగుతున్న  హింసాకాండ, ఛిద్రమవుతున్న చిన్నారుల ఫొటోలను ఒక ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు.

పసివాళ్ల కోసం కన్నీళ్లుపెడుతున్న సోషల్ మీడియా..'ప్రే ఫర్ సిరియా'

సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ దళాలు, వేర్పాటువాద మిలిటెంట్లు, ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. తుపాకుల తూటాలు, విస్ఫోటన శబ్ధాలు, శిథిలమయ్యే భవనాలు, వాటికింద పడి ప్రాణాలు వదిలే పసివాళ్లు.. ఇదంతా అక్కడ నిత్య కృత్యం. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు సిరియాలో జరుగుతున్న  హింసాకాండ, ఛిద్రమవుతున్న చిన్నారుల ఫొటోలను ఒక ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు.

‘ప్రే ఫర్‌ సిరియా(సిరియా కోసం ప్రార్థించండి)' అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ ఫొటోలను పంచుకుంటున్నారు. సిరియాలో ఛిన్నాభిన్నం అవుతోన్న బాల్యాన్ని కాపాడాలని, మానవత్వాన్ని చూపాలని కోరారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న చిన్నరుల్లానే అక్కడి చిన్నారులకు కూడా సంతోషంగా బతికే హక్కు కల్పించాలని, ఈ దిశగా ప్రపంచ దేశాల్ని  కదిలించాలని కోరుతూ ఈ హ్యాష్‌ట్యాగ్‌ ఉద్యమం కొనసాగుతోంది. 

తాజాగా టాలీవుడ్‌ నటి మెహ్రీన్‌ ఫిర్జాదా కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌ జోడించి సిరియా చిన్నారి ఫొటోను ట్వీట్‌ చేశారు. సిరియాలో చిన్నారులు ఎదుర్కొంటున్న హింస, కూరత్వం, చిన్నారుల మారణహోమాన్ని చూస్తే హృదయం ద్రవించుకుపోతోందని, మానవత్వాన్ని చాటుతూ అక్కడ శాంతి కోసం ప్రార్థించాలని ఆమె తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

 

జనావాసాలపై బాంబులు..

కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాలు, అక్కడి మిలిటెంట్లపై కొనసాగిస్తున్న దాడుల్లో కనీసం 700 మంది పౌరులు చనిపోయారు. వీరిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం ముందస్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత మిలిటెంట్లపై దాడులు చేయాలి. కానీ, అక్కడి ప్రభుత్వం అది విస్మరించి జనావాసాలపై కూడా బాంబులు జారవిడుస్తున్నాయి. దీంతో గౌటాలో ఎక్కడిక్కడ నెత్తురు ఏరులైపారుతోంది.

సిరియా రాజధాని డమస్కస్‌‌లోని శివారు నగరమైన గౌటా అయిదేళ్ల క్రితం ప్రభుత్వ బలగాల అధీనంలోనే ఉండేది. ఇతర ప్రాంతాల్లో ఉన్న మిలిటెంట్లు ఈ నగరంలోకి వచ్చి సాధారణ జనంతో కలిసిపోయారు. 2017 నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని సమకూర్చుకుని గౌటాలో పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. తహ్రీర్‌ అల్‌ షమ్‌, అల్‌ రహమాన్‌ లీజియన్‌, జైష్‌ అల్‌ ఇస్లామ్‌ తదితర గ్రూపులు తమలో తాము గొడవపడుతూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ జనాన్ని భయ =భ్రాంతులకు గురిచేస్తున్నారు. 

పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన హుస్సేన్ మాలిక్ అనే మరో నెటిజన్ కూడా సిరియాలో చిన్నారుల దయానీయ స్థితిపై ట్వీట్ ద్వారా స్పందించారు. అమాయకమైన ముఖాలతో కనిపిస్తున్న ఆ చిన్నారుల ఫొటోలు చూస్తోంటే హృదయం ద్రవిస్తోందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారు జోక్యం చేసుకుని మానవత్వంతో స్పందించాలని ఆయన కోరారు. సిరియాలో ఇంత జరుగుతోంటే బయటి ప్రపంచం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఆ చిన్నారులు చేసిన తప్పేంటి? అని హుస్సేన్ మాలిక్ తన ట్విట్‌లో ప్రశ్నించారు.

 

Read More