Home> అంతర్జాతీయం
Advertisement

భూమ్మీద ఎనిమిదో ఖండం, ఆరో మహా సముద్రం ఏర్పడనుందా?

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఖండంగా, చీకటి ఖండంగా ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోనుంది. కొత్త ఖండం, కొత్త మహాసముద్రం ఏర్పడనుంది.

భూమ్మీద ఎనిమిదో ఖండం, ఆరో మహా సముద్రం ఏర్పడనుందా?

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఖండంగా, చీకటి ఖండంగా ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోనుందా..? భూభాగంలో మరో కొత్త ఖండం ఏర్పడే అవకాశం ఉందా? కొత్త మహా సముద్రం ఏర్పడుతుందా? ఈ ప్రశ్నలన్నీ ఇటీవల ఆ ఖండ వాసులకి తలెత్తినవే. మరి అది నిజమేనా.. అంటే అవును, అలా జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందీ..?

నైరుతి కెన్యాలోని రిఫ్ట్‌ వ్యాలీలో ఇటీవల అకస్మాత్తుగా భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. ఇవి కొన్ని మైళ్ల వరకు వ్యాపించాయి. దీంతో నైరోబీ-నరోక్‌ హైవే కొంతభాగం ధ్వంసమైంది. కొన్ని ఇళ్లు కూడా కుప్పకూలాయట. దీంతో ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోనుందట. అయితే ఇది జరగడానికి ఇంకొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఆఫ్రికా ఖండం రెండుగా ముక్కలవ్వడానికి సుమారు 50 మిలియన్‌ ఏళ్లు పట్టే అవకాశముందని ఇటీవల కొన్ని నివేదికల్లో తెలిపారు. సోమాలి టెక్టానిక్‌ ప్లేట్‌ నుబియన్‌ ప్లేట్‌ నుంచి విడిపోయే క్రమంలో ఈ చీలిక జరుగుతుందని నిపుణులు వెల్లడించారు. కొద్దికొద్దిగా తూర్పు పక్కకు జరుగుతూ మిలియన్ సంవత్సరాల తర్వాత పూర్తిగా రెండుగా విడిపోతుందని చెప్పారు. ఇది భూ అంతర్భాగంలో జరిగే ప్రక్రియ అని.. దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అలా విడిపోయిన ప్లేట్ల మధ్య మహా సముద్రం ఏర్పడి.. ఆఫ్రికా ఖండం చిన్నదిగా మారిపోతుంది. హిందూ మహాసముద్రంలో ఇథియోపియా, సోమాలియా, టాంజానియా, కెన్యాలతో ఓ భారీ దీవి లేదా ఖండం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, రైల్వే లైన్ల వంటి పనులు మొదలుపెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

Read More