Home> తెలంగాణ
Advertisement

Munugode Bypoll: మునుగోడులో ప్లాన్ మార్చిన కేసీఆర్... అభ్యర్థి ఎంపికలోనూ ట్విస్ట్!

Kcr Munugode Meeting : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో హుజురాబాద్ తరహాలోనే మునుగోడు నిధులు భారీగా వస్తాయనే ప్రచారం సాగింది. మునుగోడులో  నిర్వహించిన ప్రజా దీవెన సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలోనే నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తారని అంతా ఆశించారు.

Munugode Bypoll: మునుగోడులో ప్లాన్ మార్చిన కేసీఆర్... అభ్యర్థి ఎంపికలోనూ ట్విస్ట్!

Kcr Munugode Meeting : తెలంగాణలో గత రెండేళ్లుగా ఉపఎన్నికల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజురాబాద్ కు ఉప ఎన్నికలు జరిగాయి.  ఉప ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గాలకు భారీగా నిధులు ఇచ్చింది ప్రభుత్వం. బైపోల్ తో ఆ నియోజకవర్గాల దశ మారింది. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయనే టాక్ ఉంది, ఇక ప్రతిష్టాత్మకంగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నిధుల వరద పారించింది ప్రభుత్వం. నియోజకవర్గంలోని రోడ్లకు మహార్దశ పట్టింది. దళిత బంధు పథకం కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు.

తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో హుజురాబాద్ తరహాలోనే మునుగోడు నిధులు భారీగా వస్తాయనే ప్రచారం సాగింది. మునుగోడులో  నిర్వహించిన ప్రజా దీవెన సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలోనే నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తారని అంతా ఆశించారు. కాని కేసీఆర్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. వరాలు కాదు ఓన్లీ సెంటిమెంట్ అన్నట్లుగా కేసీఆర్ ప్రచారం సాగింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ గెలిస్తే సంక్షేమ పథకాలు ఉండవంటూ సెంటిమెంట్ అస్త్రం రగిలించారు. వ్యవసాయ మోటార్లకు బీజేపీ మీటర్లు పెట్టాలని చూస్తుందంటూ అన్నదాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ గెలిస్తే మీటర్లకు మోటార్లు వస్తాయంటూ.. ఆసరా పెన్షన్లు ఆగిపోతాయంటూ
సెంటిమెంట్ తో కొట్టారు సీఎం కేసీఆర్.

మునుగోడు సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. నియోజకవర్గానికి వరాలు ప్రకటిస్తారని భావిస్తే తుస్సుమనిపించారని కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే మునుగోడు సభలో కేసీఆర్ వ్యూహాత్మకంగా మాట్లాడారని తెలుస్తోంది. ముఖ్యంగా నిధుల విషయంలో కేసీఆర్ ప్లాన్ మార్చారని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో చేసిన అభివృద్ధి టీఆర్ఎస్ కు ప్లస్ కాకుండా మైనస్ అయిందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్లే ప్రభుత్వం నిధులు ఇచ్చిందనే ప్రచారం సాగడంతో ఓటర్లు కూడా అదే అభిప్రాయంతో ఈటల వైపు మొగ్గు చూపారని.. ఎన్నిక అనంతరం కేసీఆర్ నిర్వహించిన పోస్ట్ మార్టమ్ లో తేలిందంటున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు కుడా ఈటలకే కలిసి వచ్చిందంటున్నారు. ఈటల రాజీనామా వల్లే తమకు 10 లక్షల రూపాయలు వచ్చాయంటూ దళిత బంధు లబ్జిదారులు కూడా రాజేందర్ కే జైకొట్టారని తేలింది. దీంతో మునుగోడు విషయంలో అలాంటి తప్పు చేయకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారని అంటున్నారు.  తాను రాజీనామా చేసినందున మునుగోడుకు భారీగా నిధులు రాబోతున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిధులు ప్రకటిస్తే అది రాజగోపాల్ రెడ్డికి కలిసివస్తుందని గ్రహించిన కేసీఆర్.. నిధుల మాట ఎత్తకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలనే జనాలకు గుర్తు చేశారని అంటున్నారు. ఇది ఒక రకంగా రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందికరమేననే చర్చ సాగుతోంది.

మునుగోడు సభలో అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రచారం సాగినా కేసీఆర్ ఎవరి పేరును ప్రకటించలేదు. దీనిపైనా ఇప్పుడు నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారైందని.. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని కొన్ని మీడియాల్లోనూ వార్తలు వచ్చాయి. కాని కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో  మునుగోడు అభ్యర్థి విషయంలో కేసీఆర్ మనసు మారిందనే చర్చ సాగుతోంది. మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో  అసమ్మతి తీవ్రంగా ఉంది. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని పార్టీ నేతలు ఓపెన్ గానే ప్రకటనలు చేశారు. దాదాపు 3 వందల మంది నేతలు ప్రత్యేకంగా సమావేశమై కూసుకుంట్లకు వ్యతిరేకంగా ఏకంగా తీర్మానం చేశారు. మునుగోడు పరిణామాలపై ఆరా తీసిన కేసీఆర్.. అభ్యర్థి విషయంలో పీకే టీమ్ తో తాజాగా మళ్లీ సర్వే చేయిస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ సభకు జనసమీకరణ కోసం మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించారు కేసీఆర్. వారం రోజుల పాటు నియోజకవర్గంలో తిరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ నేతలు, కార్యకర్తలు, జనాల నాడి తెలుసుకున్నారని సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు అభ్యర్థి విషయంలో కేడర్ అభిప్రాయంతో పాటు జనాల స్పందనను హైకమాండ్ కు నివేదించారని తెలుస్తోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని అందులో తేలిందంటున్నారు.

మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉంది. నియోజకవర్గంలో దాదాపు 67 శాతం బీసీ ఓటర్లు ఉండటంతో పార్టీలకు భయం పట్టుకుంది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం లాంఛనమే. కాంగ్రెస్ అభ్యర్థిగా బిల్డర్ చలమల్ల కృష్ణారెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థిగా బీసీని పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. నాగార్జున సాగర్ లో రాజతీయ కురువృద్ధుడు జానారెడ్డిని ఓడించడానికి బీసీ వాదనే పనిచేసిందని కొందరు నేతలు కేసీఆర్ కు చెప్పారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఫిబ్రవరి రెండో వారం వరకు గడువుంది. దీంతో అభ్యర్థి విషయంలో తొందర పడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని అంటున్నారు. షెడ్యూల్ వచ్చాక ప్రకటిస్తే సరిపోతుదని.. అప్పటివరకు అందరు నేతలు కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచించారని చెబుతున్నారు. మొత్తంగా మునుగోడు సభలో అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కూసుకుంట్లకు చెక్ పడినట్టేననే అభిప్రాయం నియోజకవర్గ జనాల్లో వ్యక్తమవుతోంది.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో దారుణం... పిల్లల ఎదుటే భార్య గొంతు కోసి చంపిన భర్త

Also Read: Acb Raids: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో  40 బుల్లెట్లు.. వేములవాడలో కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More