Home> క్రీడలు
Advertisement

జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో భారతీయ యువతి దీపా కర్మాకర్‌కి స్వర్ణం

ప్రముఖ భారతీయ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ టర్కీలో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.

జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో భారతీయ యువతి దీపా కర్మాకర్‌కి స్వర్ణం
ప్రముఖ భారతీయ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ టర్కీలో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. త్రిపురకు చెందిన ఈ 24 ఏళ్ళ యువ క్రీడాకారిణి 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో కూడా ఆశించిన ప్రతిభే కనబరిచి 4వ స్థానాన్ని కైవసం చేసుకొని.. పతకాన్ని త్రుటిలో పోగొట్టుకోవడం విశేషం.
 
9 ఆగస్టు 1993లో అగర్తాలలో జన్మించిన దీపా కర్మాకర్ 2014 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం కైవసం చేసుకోగా.. 2015లో హిరోషిమాలో జరిగిన ఆసియన్ ఛాంపియన్ షిప్‌లో కూడా కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. 2017లో భారత ప్రభుత్వం దీపా కర్మాకర్‌ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2016లో ఈమెను రాజీవ్ ఖేల్ రత్న పురస్కారంతో కూడా ప్రభుత్వం గౌరవించింది. ఇటీవలి కాలంలో నిత్యం గాయాలతో సతమతమై.. కామన్వెల్త్ క్రీడల నుండి కూడా తప్పుకోవడానికి యత్నించిన ఈమె... ఇప్పుడు నిజంగానే వరల్డ్ కప్‌లో స్వర్ణం గెలుచుకోవడం స్ఫూర్తిదాయకమని పలువురు క్రీడాభిమానులు అంటున్నారు. 
 
దీపా కర్మాకర్ తాజాగా సాధించిన స్వర్ణ పతకంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆమెకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ విజయం ఆమె పట్టుదలకు, దీక్షకు కచ్చితమైన ఉదాహరణ అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో దీపా జిమ్నాస్టిక్స్‌లో వాల్ట్‌ ఆఫ్‌ డెత్‌‌గా పేర్కొన్న ప్రొడునోవా విన్యాసం కూడా చేసి ఎందరినో ఆశ్చర్యపరిచింది. అలాగే భారత్ నుండి  ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్ కూడా దీపా కర్మాకరే కావడం గమనార్హం.
 
Read More