Home> క్రీడలు
Advertisement

ప్రతీకారం తీర్చుకోవాలని భారత్.. గెలిచి తీరాలని కివీస్..

ఇండియా vs న్యూజీలాండ్ 3వ వన్డే

ప్రతీకారం తీర్చుకోవాలని భారత్.. గెలిచి తీరాలని కివీస్..

న్యూజీలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 2 మ్యాచ్‌లు గెలుచుకున్న టీమిండియా.. బే ఓవల్ వేదికగా సోమవారం జరగనున్న 3వ వన్డేలోనూ గెలుపు సొంతం చేసుకుని ఎలాగైనా సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ వన్డే సిరీస్ భారత్ కైవసమైతే, 2014లో కివీస్‌తో వన్డే సిరీస్‌ ఓడినదానికి బదులుగా భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టే అవుతుంది. ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ గెలుచుకున్న టీమిండియా అదే ఊపుతో న్యూజీలాండ్‌లో అడుగుపెట్టి అక్కడ ఆడిన తొలి రెండు వన్డే మ్యాచ్‌ల్లోనూ విజయం సొంతం చేసుకుంది. 

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కి గురైన అనంతరం బీసీసీఐ నుంచి ఇటీవలే తిరిగి ఊరట పొందిన ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్య సోమవారం జరగనున్న 3వ వన్డేలో ఆడనున్నాడు. ఇక కెప్టేన్ విరాట్ కోహ్లీ విషయానికొస్తే, చివరి రెండు వన్డేలతోపాటు ఆ తర్వాత కివీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు సైతం కోహ్లీ విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో ప్రస్తుత న్యూజీలాండ్ పర్యటనలో చివరిదైన సోమవారం నాటి వన్డేను సూపర్ ఇన్నింగ్స్‌తో ముగించాలని చూస్తున్నాడు. 

ఇదిలావుంటే, 3వ వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవం చేసుకోవాలని మరోవైపు న్యూజీలాండ్ జట్టు ప్రయత్నిస్తోంది. సోమవారం నాటి వన్డేలో తాము ఓడితే, ఇక సిరీస్ చేజారినట్టేననే ఒత్తిడి కివీస్ జట్టును వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న మ్యాచ్‌లో విజయం ఎవరిని వరించనుందో వేచిచూడాల్సిందే మరి.

Read More