Home> లైఫ్ స్టైల్
Advertisement

నాపేరు 'ఆజాద్', నాన్న పేరు 'స్వాతంత్ర్యం'

చంద్రశేఖర్ ఆజాద్ దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరు.

నాపేరు 'ఆజాద్', నాన్న పేరు 'స్వాతంత్ర్యం'

చంద్రశేఖర్ ఆజాద్ దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరు. నేడు ఆయన 87వ వర్ధంతి. దేశం ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తోంది. చంద్రశేఖర్ ఆజాద్ ను 1931లో అలహాబాదులోని  అల్ఫ్రెడ్ పార్కులో కాల్చి చంపారు. ఆజాద్ వారితో పోరాడిన తీరు భారత విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన. చంద్రశేఖర్ ఆజాద్ ఉద్యమాలు, పోరాటపటిమల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం..!

దేశం కోసం తన జీవితాన్నే అర్పించిన ఈ  విప్లవ యోధుని గురించి కొన్ని వాస్తవాలు:

* చంద్రశేఖర్ ఆజాద్ గా పేరుగాంచిన చంద్రశేఖర్ తివారీ 1906 జూలై 23న మధ్య ప్రదేశ్ లోని ప్రస్తుత అలిరాజ్పుర్ జిల్లాలోని భావ్రా గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు పండిట్ సీతారాం తివారీ, తల్లి పేరు జాగ్రాని దేవి తివారీ. 

* ఆజాద్ ప్రారంభ విద్యను భావ్రాలో, ఉన్నత విద్యను వారణాసిలోని సంస్కృత పాఠశాలలో చదివారు. 

*విద్యార్ధి దశలో ఉండగా, ఆజాద్ 1921లో స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులు అతడిని పట్టుకెళ్లి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అప్పుడు చంద్రశేఖర్ ని, న్యాయమూర్తి నీ పేరేంటి? అని అడగ్గా, నా పేరు 'ఆజాద్' అని, తండ్రి పేరు 'స్వాతంత్ర్యం' అని అన్నాడు. నీ నివాసం ఎక్కడ అని అంటే జైలే నా నివాసం అని సమాధానం ఇచ్చారు. న్యాయమూర్తి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. 

* ఆరోజుల్లోనే విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది. అజాద్ జీవితంలో అదో పెద్ద మలుపు. బిస్మిల్ అడుగుజాడల్లో విప్లవ శంఖం పూరించాడు. ఉద్యమానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలడానికి తిరుగుబాటే మార్గం అవుతుందని సంకేతాలు ప్రజలకు అందించడం- ఆశయంగా పెట్టుకుని 1925లో జరిగిన కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నారు. అప్పుడు దోపిడీలో పాల్గొన్న వారని అందరినీ పోలీసులు పట్టుకొనగా.. ఆజాద్ తప్పించుకున్నాడు. 

* 1929లో లాహోర్‌లో జరిగిన సైమన్ కమిషన్ నిరసన ప్రదర్శనలో లాలా లజపతిరాయ్‌పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి జరిపాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక 'పంజాబ్ కేసరి' నేలకొరిగాడు. విప్లవ వీరులు చూస్తూ ఊరుకోలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆగ్రహంతో రగిలిపోతూ సాండర్స్‌ను హతమార్చారు. 

* 1929 జూలై 10న సాండర్స్ హత్యకేసు విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం 32మందిపై నేరం మోపింది. ఆ బూటకపు విచారణానంతరం అజాద్‌తో సహా తొమ్మిదిమందిని పరారీలో వున్నారని ప్రకటించింది.

* 1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ అలహాబాదులోని ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఓ చెట్టుకింద అజాద్ కూర్చుని ఉన్నాడని ఓ యువకుడు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆజాద్ ను చూసి అతనిపై కాల్పులు జరిపారు. ఆజాద్ కూడా కాల్పులు జరిపి, ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ తన తుపాకీతో తనే కాల్చుకొని వీరమరణం పొందాడు.

Read More