Home> జాతీయం
Advertisement

"అమ్మ" పేరుతో తమిళనాడులో కొత్తపార్టీ ఆవిర్భావం

అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ గురువారం మధురైలో కొత్త పార్టీ ప్రారంభించారు.

అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ గురువారం మధురైలో కొత్త పార్టీ ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరుతో ఈ పార్టీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. "అమ్మ మక్కల్ మున్నేత్ర కళగం" పేరుతో ప్రారంభమైన ఈ పార్టీ జెండాలో జయలలిత చిత్రానికి చోటు కల్పించారు. రాబోయే ఎన్నికల్లో "కుక్కర్" గుర్తుతో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు దినకరన్ తెలిపారు.

ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండు ఆకుల గుర్తును చేజిక్కించుకొని.. సీఎం పళనీస్వామి, పన్నీర్ సెల్వంల వర్గీయులు తమదే అసలైన పార్టీ అని ప్రచారం చేసుకుంటున్నారని దినకరన్ ఆరోపించారు. తాము ప్రారంభించిన "అమ్మ మక్కల్ మున్నేత్ర కళగం" పార్టీయే అసలైన అన్నాడీఎంకే పార్టీ అని.. తాము త్వరలో పళనీస్వామి, పన్నీర్ సెల్వంల పై న్యాయపరమైన చర్యలు తీసుకొని.. పార్టీ గుర్తును చేజిక్కించుకుంటామని దినకరన్ తెలిపారు

తాము ప్రారంభించిన "అమ్మ మక్కల్ మున్నేత్ర కళగం" పార్టీ పేదలకు, బడుగువర్గాలకు, రైతులకు ఆశాదీపమని దినకరన్ తెలిపారు. కావేరీ జలాల సమస్యను తమ పార్టీ మాత్రమే తీర్చగలదని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా జయలలిత చిరకాల కోరికైన మోడల్ స్టేట్‌గా తమిళనాడును మార్చడమే తమ కర్తవ్యమని దినకరన్ అన్నారు.

గతంలో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా ఆర్ కే నగర్ పోల్స్‌లో నిలబడి గెలిచారు. అప్పుడే తనకు తాత్కాలిక గుర్తును కేటాయించమని ఆయన ఎన్నికల కమీషనును కోరారు. సినీ నటుడు కమల్ హాసన్ తన పార్టీని ప్రకటించిన వారాల వ్యవధిలో దినకరన్ కూడా పార్టీని ప్రకటించడం గమనార్హం. అలాగే ఇప్పటికే నటుడు రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. కాగా.. ఆయన ఇంకా పార్టీ పేరును ప్రకటించాల్సి ఉంది

Read More