Home> జాతీయం
Advertisement

శబరిమల దర్శనానికి వచ్చిన తృప్తి దేశాయ్‌‌కి నిరసన సెగ

శబరిమలలో అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌‌‌కి నిరసన సెగ తగిలింది. 

శబరిమల దర్శనానికి వచ్చిన తృప్తి దేశాయ్‌‌కి నిరసన సెగ

శబరిమలలో అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌‌‌కి నిరసన సెగ తగిలింది. అనేకమంది ఆందోళనకారులు విమానాశ్రయం బయట బైఠాయించి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె దర్శనం చేసుకోకుండా తాము అడ్డుకొని తీరుతామని ఆందోళనకారులు తెలిపారు. ఒకవేళ ఆమె బయటకు వచ్చినా తనను కొండ పైకి తీసుకెళ్లేందుకు ఆటోలు గానీ, కార్లు గానీ, క్యాబ్‌లు గానీ, బస్సులు గానీ సహకరించకూడదని.. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆందోళనకారులు ఉద్ఘాటించారు.

ఈ రోజు తెల్లవారుజామున 4.40గంటలకు కోచి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తృప్తి దేశాయ్‌‌‌కి ఎయిర్ పోర్టు బయట నిరసన సెగ తగిలింది. ‘తృప్తి  దేశాయ్‌ దర్శనానికి రాలేదు. ప్రశాంతంగా ఉన్న శబరిమలలో అలజడిని సృష్టించేందుకే ఆమె వచ్చారు. ఆమెను పోలీసులు అరెస్టు చేయాలి’ అని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బయట ఉద్రిక్త వాతావరణం చెలరేగడంతో తృప్తి దేశాయ్‌ ఎయిర్ పోర్టులోనే ఉండాలని పోలీసులు సూచించారు. దాంతో ఆమె ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. 

నిరసన చేస్తున్న ఆందోళనకారుల్లో పలువురు బీజేపీ నేతలు కూడా ఉన్నారు. 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసుండే మహిళలు అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టడం నిషిద్ధమని.. ఆమె తమ మాట వినకుండా దర్శనానికి బయలుదేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాగా.. శబరిమల అయ్యప్పను దర్శించుకునేంతవరకు తాను మహారాష్ట్ర తిరిగి వెళ్లనని తృప్తి పట్టుబడడం గమనార్హం. కేరళ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని,  వారు తమకు భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత కేరళ ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.

 

Read More