Home> జాతీయం
Advertisement

ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వైకాపా ఎంపీలు

ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) ఎంపీల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది.

ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న  వైకాపా ఎంపీలు

ఢిల్లీ: ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. నిన్న వర్షానికి టెంట్లు పడిపోవడంతో ఏపీ భవన్‌ కారిడార్‌లో నిరాహారదీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని వైసీపీ ఎంపీలు పేర్కొంటున్నారు.  బీజేపీ, టీడీపీ కలిసి ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నాయని వారు ఆరోపించారు.    

కాగా..ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలను నేడు వైద్యులు పరీక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్సలేమీ అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు.

ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు 'ఎన్డీఏ ప్రభుత్వం ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని' పేర్కొంటూ లోక్‌సభ  స్పీకర్  సుమిత్రా మహాజన్‌కు  రాజీనామా లేఖలు సమర్పించారు. సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాక వైసీపీ ఎంపీలు నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి ఆమరణ దీక్షలో కూర్చున్నారు.  ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. ఎంపీల దీక్షకు మద్దతు పలికేందుకు పలువురు వైసీపీ నేతలు ఢిల్లీ బాటపట్టారు. విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ బృందం, దిల్లీ విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రత్యేకహోదా ఇస్తేనే ఏపీకి పరిశ్రమలొస్తాయి. మాకు ఉద్యోగాలూ వస్తాయని తెలుగు విద్యార్థులు వ్యాఖ్యానించారు. అఖిలభారత మానవ హక్కుల సంఘం ప్రతినిధులు కూడా సంఘీభావం తెలిపారు.

మార్చి 31న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీలు 'హోదా' కోసం న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో ఆమరణ దీక్ష చేస్తారని ప్రకటించిన విషయంతెలిసిందే..!

Read More