Home> జాతీయం
Advertisement

రాఫెల్ జెట్ డీల్: వివరాలను సుప్రీంకోర్టుకి అందించిన కేంద్ర ప్రభుత్వం

రాఫెల్ జెట్ డీల్‌కు సంబంధించి నిర్ణయాధికారం తీసుకున్నప్పుడు పరిగణనలోకి తీసుకొనే విషయాలపై సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందించారు.

రాఫెల్ జెట్ డీల్: వివరాలను సుప్రీంకోర్టుకి అందించిన కేంద్ర ప్రభుత్వం

రాఫెల్ జెట్ డీల్‌కు సంబంధించి నిర్ణయాధికారం తీసుకున్నప్పుడు పరిగణనలోకి తీసుకొనే విషయాలపై సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందించారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు..  వివరాలను ఓ సీల్డ్ కవరులో పెట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున అందించారు.  గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ సమాచారం అడిగిన సంగతి తెలిసిందే. అయితే తొలుత అభ్యంతరం తెలిపిన కేంద్రం వివరాలు అందించేందుకు నిర్ణయించుకుంది. 

సుప్రీంకోర్టు ఆ వివరాల్లో సాంకేతిక అంశాలను పొందుపరచవద్దని.. నిర్ణయం తీసుకున్న క్రమంలో పాటించిన పద్ధతులను గురించి తెలపాలని ప్రస్తావించాక.. ఎట్టకేలకు కేంద్రం వివరాలను పంపించింది. గతంలో ఈ వివరాలు  పంపించేందుకు సుప్రీంకోర్టు అక్టోబరు 29వ తేదిని డెడ్ లైన్‌గా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని రాఫెల్ డీల్‌కు సంబంధించి ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని జెట్స్ తయారీలో కాంట్రాక్టును ప్రతిష్టాత్మక హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ సంస్థకు కాకుండా అనిల్ అంబానీకి సంబంధించిన రిలయెన్స్ డిఫెన్స్‌కి కట్టబెట్టడం పై మండిపడింది.

కాగా.. హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న మూడు వేలమంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడ్డారని పలు పత్రికలు ఇటీవలే వార్తలు రాశాయి. రాఫెల్ కాంట్రాక్టును రిలయన్స్ కంపెనీకి  అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే దీనికి కారణం అని కూడా పలువురు ట్రేడ్ యూనియన్ నేతలు తెలిపారు. ప్రస్తుతం రాఫెల్ ఒప్పందం విషయానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో పాటు మిగతా పార్టీల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది.

Read More