Home> జాతీయం
Advertisement

ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ మిత్రా మృతి

పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థికమంత్రి మరియు ప్రముఖ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త అశోక్ మిత్రా ఈ రోజు కోల్‌కతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ మిత్రా మృతి

పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థికమంత్రి మరియు ప్రముఖ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త అశోక్ మిత్రా ఈ రోజు కోల్‌కతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ళ మిత్రా గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అశోక్ మిత్రా అనేక పత్రికల్లో ఆర్థికరంగంపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. ఢాకా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ చేసిన మిత్రా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు.

జ్యోతిబసు బెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్‌లో మిత్రా ఆర్థికమంత్రిగా సేవలందించారు. అంతకు ముందు ఆయన ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత వ్యవసాయ ధరల కమీషనుకు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజకీయాల నుండి తప్పుకున్నాక మిత్రా సామాజిక రంగంలో సేవలందించారు. 

నోబెల్ బహుమతి గ్రహీత జాన్ టిన్‌బర్గన్ ఆధ్వర్యంలో పరిశోధన చేసిన అశోక్ మిత్రా 1953లో ఆర్థికశాస్త్రంలో యూనివర్సిటీ ఆఫ్ రోటర్‌డామ్‌ నుంచి డాక్టరేటు అందుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకుతో కూడా మిత్రా పనిచేశారు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన మిత్రా ఐఐఎం, కోల్‌కతాలో ప్రొఫెసరుగా చేరారు. టెలిగ్రాఫ్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లాంటి పత్రికలకు మిత్రా విరివిగా వ్యాసాలు రాసారు.

ఎమర్జన్సీ సమయంలో కమ్యూనిస్టు భావాలు ఉన్న మిత్రా వ్యాసాలపై ఇందిరా గాంధీ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. మిత్రాకి సాహిత్యంలో కూడా మంచి ప్రవేశం ఉంది. మినీకథలెన్నో రాశారాయన. బెంగాల్ సాహిత్యానికి చేసిన సేవలకు గాను సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. 

Read More