Home> జాతీయం
Advertisement

కేంద్ర బడ్జెట్ 2018-19: సామాన్యుడు ఆశిస్తోన్న అంశాలు ?

ప్రస్తుతం సామాన్యుడు కేంద్ర బడ్జెట్ 2018-19 నుంచి ఆశిస్తున్న ముఖ్యమైన అంశాలు

కేంద్ర బడ్జెట్ 2018-19: సామాన్యుడు ఆశిస్తోన్న అంశాలు ?

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సామాన్యుల్లో ఎన్నో ఆశలు వున్నాయి. ఈసారి రాబోయే బడ్జెట్ తమకి అనుకూలంగా వుంటుందా లేక ప్రతికూలంగా వుంటుందా అని అన్నివర్గాల ప్రజలు ఎదురుచూడటం వాస్తవానికి ఈసారే కొత్తేమీ కాదు. కాకపోతే రెండేళ్ల క్రితం కేంద్రం ప్రవేశపెట్టిన పాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం, కిందటేడాది తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) లాంటి పథకాల నేపథ్యంలో 2019 ఎన్నికలకు వెళ్లడానికి ముందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆఖరి బడ్జెట్ కావడంతో ఈసారి కేంద్రం తీసుకురానున్న బడ్జెట్‌పై సామాన్యుల్లో అంచనాలు, ఆశలు మరిన్ని పెరిగిపోయాయి. 

ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థకు సామాన్యుడే స్తంభం లాంటి వాడు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పౌరుల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునే ఏ ప్రభుత్వమైనా బడ్జెట్‌ని తీర్చిదిద్దాల్సి వుంటుంది. సామాన్యుల అవసరాలు, వారి ఆకాంక్షలకి అనుగుణంగా బడ్జెట్ వుందనుకున్నప్పుడు మాత్రమే ఆ బడ్జెట్‌కి ప్రజలు ఆమోద ముద్ర వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేదంటే ఆ బడ్జెట్ విమర్శలపాలు అవడం ఖాయం. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సామాన్యుడు కేంద్ర బడ్జెట్ 2018-19 నుంచి ఆశిస్తున్న ముఖ్యమైన అంశాలు ఏంటనేది ఓసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.

> ఆదాయ పన్ను మినహాయింపు మొత్తం: ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా వున్న ఆదాయ పన్ను మినహాయింపు మొత్తాన్ని రూ. 3 లక్షలకి పెంచితే బాగుంటుంది అనే డిమాండ్ సాధారణ, మధ్య తరగతి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ తర్వాత రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయంపై రూ.5%, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల ఆదాయంపై రూ.10%, అలాగే రూ. 20 లక్షలకుపై ఆదాయంపై రూ.30% పన్ను విధించే పద్ధతి అమలు చేస్తే అల్ప ఆదాయం వర్గాలకు మేలు చేకూరుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
> సెక్షన్ 80 సీ : సెక్షన్ 80 సీ ప్రకారం వెచ్చించే పొదుపు మొత్తం ఆదాయ పన్ను పరిధిలోకి రాదు అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1.5 లక్షల కనిష్ట పరిమితిని ఇంకొంత పెంచితే బాగుంటుందనేది సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆకాంక్ష. ఒకవేళ సెక్షన్ 80 సీ ఇచ్చే మినహాయింపు మొత్తాన్ని పెంచగలిగితే తాము పన్ను పోటు భారం నుంచి బయటపడటమే కాకుండా తమ పొదుపు మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చనేది సామాన్యుని ఆశ.
> నేషనల్ పెన్షన్ స్కీమ్: నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఉపసంహరించే మొత్తాలపై సామాన్యులు పూర్తి స్థాయిలో మినహాయింపు కోరుకుంటున్నారు. 
> ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌: పౌరుల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌ని పునప్రవేశపెట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సామాన్యులు ఈ అంశంపై కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
వైద్య ఖర్చుల మొత్తం గరిష్ట పరిమితి పెంపు: ప్రైవేటు ఉద్యోగులు తమ సంస్థ యజమాని నుంచి వైద్య ఖర్చుల కోసం పొందే మొత్తం గరిష్ట పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి రూ. 15000 గా వుంది. చాలా సందర్భాల్లో, చాలామంది వైద్య ఖర్చులకి ఇది ఏ మాత్రం సరిపోవడం లేదనే అభిప్రాయం కూడా వుంది. ఆదాయ పన్ను విధింపు అంశాల్లో దీనిని కూడా పరిగణలోకి తీసుకుని ఆ గరిష్ట మొత్తాన్ని పెంచాలనేది సామాన్యుని కోరిక. 
> గృహ రుణాల భారం: గృహ రుణాలపై వడ్డీ చెల్లిస్తున్న వారికి కల్పించే పన్ను మినహాయింపు మొత్తాన్ని కూడా పెంచితే బాగుంటుందనేది సామాన్యుడి ఆకాంక్ష.
> జీఎస్టీ: లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అమలు తర్వాత అధిక వ్యయం పెరిగిపోయిందని భావిస్తున్న సామాన్యులు, మార్కెట్ వర్గాలన్నీ ఈ బడ్జెట్‌తో తమకు ఏమైనా ఉపశమనం లభించకపోతుందా అని ఎదురుచూస్తున్నాయి. 

ఇవేకాకుండా సామాన్యుల ఆకాంక్షల జాబితా ఇంకాస్త పెద్దదే అయినప్పటికీ, ప్రస్తుతానికి అధిక సంఖ్యలో అల్పాదాయ వర్గాల వారు ఆశిస్తున్న వాటిలో మాత్రం పైన పేర్కొన్న అంశాలు ముందు వరుసలో వున్నాయి. 

Read More