Home> జాతీయం
Advertisement

ఆరోజే కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డి కుమారస్వామి ప్రమాణస్వీకారం

సంబరాల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి

ఆరోజే కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డి కుమారస్వామి ప్రమాణస్వీకారం

కర్ణాటకలో గత నాలుగైదు రోజులుగా జరిగిన అనేక నాటకీయ పరిణామాల మధ్య అంతిమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకున్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రస్తుతం సంబరాల్లో మునిగితేలుతోంది. పార్టీకి అవసరమైన మెజార్టీ లేనందున బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. మెజార్టీని నిరూపించుకోవడంలో విఫలమవడంతో రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. యడ్యూరప్ప స్థానంలో జనతా దళ్ సెక్యులర్ అధినేత కుమారస్వామి సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం జరగనున్న ఈ ప్రమాణస్వీకారోత్సవానికి దేశవ్యాప్తంగా వున్న వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరు కానున్నారు. 

బీజేపీపై జేడీఎస్-కాంగ్రెస్ కూటమి గెలుపు అనంతరం జేడీఎస్ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. తమ కూటమి గెలుపు ఓ చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం. కూటమిలో తమ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగానే వున్నారు. ఎవ్వరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని కుమారస్వామి స్పష్టంచేశారు.

Read More