Home> జాతీయం
Advertisement

భారత ఆర్మీ ఎత్తుగడతో చైనా గుండెల్లో రైళ్లు..!

తమ భాషను నేర్చుకుంటే సరిహద్దు ప్రాంతాలను భారత్ తన గుప్పిట్లోకి తెచ్చుకోగలదని చైనా హడలిపోతోంది. 

భారత ఆర్మీ ఎత్తుగడతో చైనా గుండెల్లో రైళ్లు..!

భారత జవాన్లు చైనా భాష 'మాండరిన్' నేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో చైనాకు భయం పట్టుకుంది. తమ భాషపై పట్టుసాధిస్తే.. అది భారత్‌కు అదనపు బలం చేకూరుతుందని  చైనా ఆందోళన చెందుతోంది. భవిష్యత్తులో సమస్యలు వచ్చినప్పుడు ఇది వారికి వ్యూహాత్మక ప్రయోజనంగా ఉండగలదని చైనా అనుకుంటోంది. చైనా భాష నేర్చుకునేలా భారత ఆర్మీ ఇప్పటికే ఏడాది కోర్సు కోసం ఓ టీంని  సిద్ధం చేసినట్టు గతనెల ఫిబ్రవరిలో వార్తలు వచ్చాయి. ఐటీబీపీ జవానులు, అధికారులతో కూడిన 25మంది బృందానికి... మధ్యప్రదేశ్‌లోని సాంచి యూనివర్సిటీ ఆఫ్ బుద్ధిస్ట్-ఇండిస్ స్టడీస్‌లో చైనా భాష నేర్పించనున్నట్టు పీటీఐ వార్తా సంస్థ ఇటీవలి కాలంలో వెల్లడించింది.

సరిహద్దు ప్రాంతాల్లో మనస్పర్థాలకు తావులేకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భారత్ చెబుతోంది. మరోవైపు చైనా మాత్రం తమకు ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అపార్థాలు తొలిగిపోతాయన్న మాట అటుంచితే... ముందు ముందు చిన్నపాటి గొడవలు కూడా రావచ్చని వాదిస్తున్నారు. చైనా అధికారిక పత్రికతో అక్కడి భద్రతా నిపుణుడు హు జియోంగ్ మాట్లాడుతూ, ''భాషా సామర్ధ్యం అనేది మంచి సంభాషణకు ఉపయోగపడుతుంది. అయితే అది శాంతియుతంగా ఉన్నప్పుడు మాత్రమే. యుద్ధ పరిస్థితే వస్తే  అదే భారత ఆర్మీకి ఆయుధంగా మారుతుంది'' అని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో చైనా వ్యూహ రచనపై భారత ఆర్మీ అవగాహనకు వస్తే గనక వారిని ఆపడం కష్టమని.. అదే జరిగితే భారత్ మరింత  దూకుడుగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

ఇక చైనా మిలటరీ నిపుణుడు సాంగ్ జోంగ్‌పింగ్ మరో అడుగు ముందుకేసి.. ఏదైనా వివాదం తలెత్తినా, చైనా సంభాషణలు విన్నా, కదలికలను పసిగట్టినా... సరిహద్దు ప్రాంతాలను భారత్ తన గుప్పిట్లోకి తెచ్చుకోగలదని హెచ్చరించారు. హిందీ నేర్చుకోండని చైనా సైనికులను గతంలో పలువురు సూచించారు. ప్రస్తుతానికి చైనా-భారత్ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తత లేకపోయినా... 'డోక్లాం' సమస్య ఇప్పటికీ ఇరుదేశాల మధ్య పరిష్కారం కాని అంశంగా ఉంది. 

Read More