Home> జాతీయం
Advertisement

7వ వేతన సంఘం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

7వ వేతన సంఘం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతూ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు 7వ సీపీసీ కింద ఉద్యోగులు వారి జీతంలో 9 శాతం డీఏ పొందనున్నారు.

ఈ పెంపు జూలై 1, 2018 నుండి అమల్లోకి వస్తుంది. పెన్షనర్లకు అదనపు డియర్ నెస్ రిలీఫ్(డిఆర్)ను విడుదల చేసేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రాథమిక జీతం ఆధారంగా డీఏ లెక్కించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

డీఏ పెంపు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) లో రూ.6,112.20కోట్లు, డీఆర్‌ పెంపు వల్ల రూ.4,074.80కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది (2018 జూలై నుంచి 2019 ఫిబ్రవరి వరకు 8 నెలల వ్యవధిలో ఈ నిధులు ఖర్చవుతాయి). కాగా క్యాబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల 48.41లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62.03 లక్షల పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది.

అంతకుముందు జనవరి 2018లో 11మిలియన్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం డీఏను 5 శాతం నుండి 7 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం, 2.57 ఫిట్మెంట్ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ పే పొందుతున్నారు. అయితే ఉద్యోగులు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం తమ కనీస వేతనాన్ని ప్రస్తుతమున్న 18,000 నుండి 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

Read More