Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

హీరోలుగా మారుతున్న కమెడియన్స్ సక్సెస్ అవుతున్నారా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాస్యనటులుగా తమకుంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది.. ఆ తర్వాత హీరోలుగా తెరపై తమదైన శైలిలో రాణించిన నటులు చాలామందే ఉన్నారు. ఆనాటి కాలంలో చలం నుండి నేటి ఆలీ వరకు చాలామంది కమెడియన్స్‌గా పరిచయమై ఆ తర్వాత హీరోలుగా మారి చక్రం తిప్పినవారే

హీరోలుగా మారుతున్న కమెడియన్స్ సక్సెస్ అవుతున్నారా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాస్యనటులుగా తమకుంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది.. ఆ తర్వాత హీరోలుగా తెరపై తమదైన శైలిలో రాణించిన నటులు చాలామందే ఉన్నారు. ఆనాటి కాలంలో చలం నుండి నేటి ఆలీ వరకు చాలామంది కమెడియన్స్‌గా పరిచయమై ఆ తర్వాత హీరోలుగా మారి చక్రం తిప్పినవారే. అయితే హీరోలుగా మారాక కూడా.. తిరిగి కామెడీ వైపు మొగ్గుచూపిన వారు ఎందరో ఉన్నారు. ఒకసారి ఒక నటుడిని మంచి కమెడియన్‌గా ప్రజలు ఆదరించాక.. తిరిగి వారిని హీరోలుగా ఎంత శాతం వరకు ఆదరించే అవకాశం ఉంది? అది అసలు సాధ్యమేనా? లాంటి అంశాల గురించి చర్చిస్తూ.. మనం కూడా ఒకసారి అలాంటి కమెడియన్ల గురించి అవలోకనం చేసుకుందాం.

చలం - తెలుగు సినీ పరిశ్రమలో "ఆంధ్రా దిలీప్ కుమార్"గా పేరు తెచ్చుకున్న నటుడు చలం. చాలా సినిమాలలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకుంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న చలం మట్టిలో మాణిక్యం, సంబరాల రాంబాబు, ఛైర్మన్ చలమయ్య వంటి సినిమాల్లో హీరోగా నటించారు. కానీ ఆ తర్వాత మళ్లీ సహాయ నటుడిగానే కొనసాగారు.

రాజబాబు - తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా లెజెండరీ స్థాయి హోదాను సొంతం చేసుకున్న నటుడు రాజబాబు. ఆయన కూడా పిచ్చోడి పెళ్లి, తాతా మనవడు లాంటి సినిమాల్లో హీరోగా నటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ కామెడీ వైపే మొగ్గుచూపారు.

పద్మనాభం - జాతకరత్న మిడతంభొట్లు, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న లాంటి సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించిన నటుడు పద్మనాభం కూడా ఆ తర్వాత కమెడియన్‌గానే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

బ్రహ్మానందం - ఈ తరంలో కమెడియన్ రోల్స్ చేస్తూ  కూడా అప్పుడప్పుడు హీరో వేషాలు వేసిన ఘనత బ్రహ్మానందంకే దక్కుతుంది. బాబాయ్ హోటల్, జోకర్ మామా సూపర్ అల్లుడు లాంటి సినిమాల్లో బ్రహ్మీ హీరోగా నటించారు. జఫ్ఫా చిత్రంలో కూడా టైటిల్ రోల్ పోషించారు.  

బాబూ మోహన్ - ఎన్నో సినిమాల్లో తనదైన శైలిలో కమెడియన్‌గా నటించిన బాబూ మోహన్, "సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా" చిత్రంతో హీరోగా మారాడు. తన కెరీర్‌లో బాబూ మోహన్ హీరోగా నటించిన చిత్రం అది ఒక్కటే. 

శుభలేఖ సుధాకర్ - కమెడియన్‌గా, సహాయ నటుడిగా సుపరిచితుడైన శుభలేఖ సుధాకర్ "ప్రేమకు పదిసూత్రాలు" చిత్రంలో హీరోగా  నటించారు. 

ఏవీఎస్ - ఏవీఎస్, బ్రహ్మానందంతో కలిసి "సూపర్ హీరోస్" అనే చిత్రంలో హీరోగా నటించారు. అలాగే "అంకుల్" చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. 

ఆలీ - హీరోగా, కమెడియన్‌గా సక్సెన్ అయిన నటుల్లో ఆలీని ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన ఆలీ హీరోగా తొలిసారిగా "యమలీల" చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేశారు. తర్వాత చిన్నబ్బులు, పిట్టలదొర, గన్ షాట్, సర్కస్ సత్తిపండు, గుండమ్మ గారి మనవడు, సోంబేరి లాంటి చిత్రాలలో హీరోగా నటించారు. 

వేణుమాధవ్ - కమెడియన్ వేణుమాధవ్ కేవలం రెండు చిత్రాలలోనే హీరోగా నటించారు. హంగామా, ప్రేమాభిషేకం చిత్రాలలో ఆయన హీరోగా నటించారు. 

fallbacks

శివాజీ రాజా - కమెడియన్‌‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితుడైన శివాజీరాజా "మొగుడ్స్ పెళ్లామ్స్" చిత్రంలో హీరోగా నటించారు.

సునీల్ - కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. సక్సెస్ ఫుల్ కమెడియన్‌గా రాణించి.. ఆ తర్వాత పూర్తిస్థాయి హీరో పాత్రలను పోషించిన నటుడిగా సునీల్‌‌ను చెప్పుకోవచ్చు. "అందాల రాముడు" చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించిన సునీల్ ఆ తర్వాత మర్యాద రామన్న, పూలరంగడు, భీమవరం బుల్లోడు, తడాఖా లాంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. 

శ్రీనివాస రెడ్డి - కమెడియన్ శ్రీనివాసరెడ్డి "జయంబు నిశ్చయంబురా" చిత్రంలో హీరోగా నటించారు. ప్రస్తుతం "జంబలకిడి పంబ" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 

అవసరాల శ్రీనివాస్ - పలు చిత్రాలలో కామెడి పాత్రలతో పాటు సహాయక పాత్రలు పోషించిన అవసరాల శ్రీనివాస్ కూడా ఓ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. "బాబు బాగా బిజీ" చిత్రంతో హీరోగా మారారు.

ధన్ రాజ్ - జబర్దస్త్ షోతో కమెడియన్‌గా పాపులారిటీ తెచ్చుకున్న ధనరాజ్, "బంతిపూల జానకీ" చిత్రంతో హీరోగా మారారు.

క్రిష్ణుడు - హ్యాపీడేస్ చిత్రంతో కమెడియన్‌గా పరిచయమైన క్రిష్ణుడు "వినాయకుడు" చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత కోతిమూక, విలేజ్‌లో వినాయకుడు, రామదండు లాంటి చిత్రాలలో కూడా హీరోగా నటించారు. 

సప్తగిరి - "పరుగు" సినిమాతో వెండితెరకు పరిచయమైన సప్తగిరి, ఆ తర్వాత తనదైన మార్కు కామెడీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఆ తర్వాత సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగరి ఎల్ఎల్‌బీ చిత్రాలలో హీరోగా నటించాడు. 

క్రిష్ణ భగవాన్ - వంశీ చిత్రం "మహర్షి" ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్రిష్ణ భగవాన్, జాన్ అప్పారావు 40 ప్లస్, మిస్టర్ గిరీశం వంటి చిత్రాలలో హీరోగా నటించారు. 

షకలక శంకర్ - జబర్దస్త్ కామెడీషో ద్వారా మంచి కమెడియన్‌గా పరిచయమైన షకలక శంకర్ ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించారు. ఆయన హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న చిత్రమే "డ్రైవర్ రాముడు"

(కమెడియన్స్ హీరోలుగా పరిచయమైనా అందులో చాలా తక్కువమంది మాత్రమే కథానాయకులుగా విజయభేరి మోగిస్తున్నారన్నది అక్షర సత్యం. ఆలీ, సునీల్ లాంటి వారిని అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక పోతే, ఒకటి రెండు సినిమాలలో హీరోగా నటించి.. ఆ తర్వాత తిరిగి హాస్య పాత్రలు పోషించడానికి సిద్ధమవుతున్న వ్యక్తులే ఎక్కువమంది అని చెప్పవచ్చు. తమిళంలో కూడా సంతానం, వడివేలు వంటి వారు హీరో పాత్రలు పోషించినవారే. అలాగే హిందీలో కూడా రాజ్ పాల్ యాదవ్ లాంటి కమెడియన్స్ కూడా హీరో పాత్రలు పోషించారు. అయితే కమెడియన్‌గా కెరీర్ వదిలి పూర్తిస్థాయి హీరోగా మారాలంటే కొంచెం కష్టమే. కేవలం ఒకరిద్దరి విషయంలోనే అది సాధ్యమైంది. తాజాగా "డ్రైవర్ రాముడు" చిత్రంతో హీరోగా తెలుగుతెరకు పరిచయమవబోతున్నారు మరో హాస్యనటుడు షకలక శంకర్. మరి ఈయన భవితవ్యం ఎలా ఉందనేది కాలమే నిర్ణయించాలి.) 

Read More