Home> వినోదం
Advertisement

2017 టాప్ టెన్ తారలు వీరే..!

ఐఎండీబీ వెబ్‌సైట్ ప్రకటించిన టాప్ టెన్ ఇండియన్ స్టార్స్ జాబితాలో టాలీవుడ్ కథానాయకుడు ప్రభాస్ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం.

2017 టాప్ టెన్ తారలు వీరే..!

ఐఎండీబీ (ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్) వెబ్‌సైట్ ప్రకటించిన టాప్ టెన్ ఇండియన్ స్టార్స్ జాబితాలో టాలీవుడ్ కథానాయకుడు ప్రభాస్ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. సోషల్ మీడియాలో అత్యధిక పేజ్ వ్యూస్ కలిగిన భారతీయ సినీతారల జాబితా తయారుచేసిన ప్రముఖ ఆన్-లైన్ డేటాబేస్ సంస్థ ఐఎండీబీ ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో కింగ్ ఖాన్ షారుఖ్ తొలి స్థానంలో నిలవగా, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ రెండవ స్థానంలో నిలిచారు.

అయితే దక్షిణాది నుండి కేవలం ఒకే హీరోకి ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ జాబితాలో ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్న  ప్రభాస్ ఆ ఘనతను పొందడం విశేషం. అయితే బాహుబలిలో ప్రభాస్‌తో పాటు నటించిన తమన్నా ఈ లిస్ట్‌లో 4వ స్థానాన్ని పొంది, ప్రభాస్ కన్నా మెరుగైన ర్యాంకింగ్ పొందడం గమనార్హం. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇర్ఫాన్ ఖాన్ మొదలైన వారికి కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కింది.  ఈ క్రమంలో టాప్ టెన్ కథానాయకుల పూర్తి వివరాలు మీకోసం

షారుఖ్ ఖాన్ - ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉన్న హీరోల్లో షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 2017లో ఆయన నటించిన చిత్రాలు పెద్దగా విడుదలవ్వక పోయినా... ఇంకా కింగ్  ఖాన్‌కు పాపులారిటీ తగ్గలేదన్న మాట.

అమీర్ ఖాన్ - దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి చిత్రాలతో భారతదేశానికి బాలికల సత్తా ఏమిటో చూపించిన అమీర్ రెండవ స్థానంలో నిలవడం విశేషం.

సల్మాన్ ఖాన్ - ప్రస్తుతం సల్మాన్ నటిస్తోన్న "టైగర్ జిందా హై" చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉండడం వల్ల ఆయన కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ మూడవ స్థానంలో నిలిచారు.

తమన్నా భాటియా - మిల్కీ బ్యూటీ తమన్నాకి బాహుబలి చిత్రం విడుదలయ్యాక వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అదే పాపులారిటీతో సోషల్ మీడియాలో ఎందరో అభిమానులను సంపాదించుకున్న తమన్నా, ఈ జాబితాలో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇర్ఫాన్ ఖాన్ - సహజనటుడిగా మంచి హాస్యాన్ని పండించడంలో ఇర్ఫాన్ ఖాన్ మేటి. ఇటీవలి కాలంలో ఆయన నటించిన "కరీబ్ కరీబ్ సింగిల్"లో ఆయన డైలాగ్ డెలవరీ ప్రేక్షకులకు నవ్వులు పూయించింది. ప్రస్తుతం అదే పాపులారిటీతో ఇర్ఫాన్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు

ప్రభాస్ - బాహుబలి చిత్రం విడుదలయ్యాక, దక్షిణాది నటుడు ప్రభాస్‌కి ఉత్తరాదిలో కూడా దక్కిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ ఫాలోయింగే ఆయనకు ఈ జాబితాలో ఆరవ స్థానాన్ని కట్టబెట్టింది.

అనుష్క శర్మ - ప్రస్తుతం విరాట్ కోహ్లీతో ప్రేమ వ్యవహారం, అనుష్క శర్మ పేరును సోషల్ మీడియాలో పదే పదే ప్రస్తావనకు తెస్తుందనడంలో సందేహం లేదు. అదే పాపులారిటీతో ఆమె ఈ లిస్టులో ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు.

అనుష్క శెట్టి - బాహుబలిలో దేవసేన పాత్ర అనుష్కకు మంచి ఫాలోయింగే తీసుకువచ్చింది. అలాగే ప్రస్తుతం ఈమె నటిస్తోన్న భాగమతి చిత్రంపై కూడా ఆమె అభిమానులకు మంచి అంచనాలు ఉండడంతో ఈ హీరోయిన్ ఈ జాబితాలో  ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. 

హృతిక్ రోషన్ - జయాపజయాలను పక్కన పెడితే, హృతిక్ రోషన్‌కు యువతలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన డ్యాన్స్ వీడియోలు చూడడం కోసమే దాదాపు అనేకమంది అభిమానులు నెట్‌లో గడుపుతుంటారంటే అతిశయోక్తి కాదు. అదే పాపులారిటీతో హృతిక్ ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారు.

కత్రినా కైఫ్ - దాదాపు 210 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్న "థగ్స్ ఆఫ్ హిందుస్తాన్" చిత్రంలో కత్రినా కైఫ్ క్వీన్ ఎలిజబెత్ పాత్రలో నటిస్తున్నారట. అలాగే టైగర్ జిందా హై చిత్రంలో సల్మాన్ సరసన కూడా నటిస్తున్నారు ఈ బాలీవుడ్ బ్యూటీ. అదే పాపులారిటీతో ఈమె ప్రస్తుతం ఈ జాబితాలో పదవ స్థానంలో కొనసాగుతున్నారట.

Read More