Home> వినోదం
Advertisement

'పద్మావత్'కి అడ్డంకిగా మారిన కర్ణిసేన !

సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నప్పటికీ.. పద్మావత్ సినిమాకు కష్టాలు, అడ్డంకులు తొలగడం లేదు.

'పద్మావత్'కి అడ్డంకిగా మారిన కర్ణిసేన !

పద్మావత్ సినిమాకు కష్టాలు, అడ్డంకులు తొలగడం లేదు. సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. అందుకోసం పద్మావత్ యూనిట్ భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఆ సినిమాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్న కర్ణిసేన మాత్రం సినిమాను అడ్డుకుని తీరుతాం అని మరోసారి స్పష్టంచేసింది. బుధవారం మీడియాతో మాట్లాడిన కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వి.. ''పద్మావత్ సినిమా రిలీజైన రోజున జనతా కర్ఫ్యూ నిర్వహిస్తాం'' అని అన్నారు. ఈ సినిమాలో అల్లా ఉద్దీన్ ఖిల్జీ, పద్మావతికి మధ్య ఏ మాత్రం అభ్యంతరకరమైన సన్నివేశాలు వున్నా.. తాము ఊరుకునే ప్రసక్తే లేదని కల్వి ప్రకటించారు.

తొమ్మిది మంది సభ్యుల బృందం ఈ సినిమాను సెన్సార్ చేయాలనే డిమాండ్ వుండగా కేవలం త్రిసభ్య కమిటీ మాత్రమే సినిమాను సెన్సార్ చేయడం ఏంటని ప్రశ్నించిన కల్వి.. రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధించడాన్ని అభినందించారు. అంతేకాకుండా.. తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాఖండ్, చత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాలు కూడా అదే బాటలో పయణిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. చరిత్రను వక్రీకరించి చూపిస్తున్న పద్మావత్ సినిమా థియేటర్లలోకి రావడానికి వీల్లేదని కల్వి అభిప్రాయపడ్డారు. 

సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దీపికా పదుకునే టైటిల్ రోల్ పోషించగా రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

Read More