Home> వినోదం
Advertisement

కన్నడ హీరో సుదీప్ హాలీవుడ్ ఎంట్రీ..?

  

కన్నడ హీరో సుదీప్ హాలీవుడ్ ఎంట్రీ..?

ఈగ, బాహుబలి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన ప్రముఖ కన్నడ హీరో సుదీప్ ఇప్పుడు హాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎడ్డీ ఆర్య అనే ఆస్ట్రేలియన్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ది నేవిగేటర్, ది సిస్టమ్ లాంటి సినిమాలను తెరకెక్కించిన ఎడ్డీ ఆర్య ప్రస్తుతం తాను తీయబోయే "రైజన్" అనే సినిమాలో సుదీప్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సుదీప్ ఆర్మీ అధికారి పాత్రను పోషిస్తున్నారని వినికిడి. అయితే ఈ విషయమై ఆయన నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.

గతంలో కూడా పలువురు భారతీయ నటులు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ "ది గ్రేట్ గాట్స్ బీ" అనే ఆంగ్ల సినిమాలోనూ, రజనీకాంత్ "ది బ్లడ్ స్టోన్" అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటించారు. తెలుగు నటుడు సుమన్ కూడా "డెత్ అండ్ టాక్సీస్" అనే విదేశీ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు. నసీరుద్దీన్ షా, అమ్రిష్ పూరి, అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి నటులు కూడా పలు హాలీవుడ్ చిత్రాలలో నటించారు. మెగస్టార్ చిరంజీవి కూడా "అబు - ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్" అనే చిత్రంలో నటించారు. అయితే ఆ చిత్రం షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ప్రస్తుతం సుదీప్ ఒకవేళ హాలీవుడ్ చిత్రంలో నటిస్తే.. అది ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

 

Read More