Home> వినోదం
Advertisement

Chiranjeevi Padma Vibhushan: చిరంజీవి కీర్తి కిరీటంలో పద్మ విభూషణ్.. ఈయన కెరీర్‌లో కీలక మలుపులు ఇవే..

Chiranjeevi Padma Vibhushan: చిరంజీవి కీర్తి కిరిటంలో మరో అవార్డు వచ్చి చేరింది. కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్‌ను 2024 గాను పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న సినీ ప్రముఖుడు చిరు కావడం విశేషం. ఈ నేపథ్యంలో చిరు కెరీర్ పై జీ న్యూస్ విశ్లేషణ..

Chiranjeevi Padma Vibhushan: చిరంజీవి కీర్తి కిరీటంలో పద్మ విభూషణ్.. ఈయన కెరీర్‌లో కీలక మలుపులు ఇవే..

Chiranjeevi Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరో పద్మ అవార్డు నడుచుకుంటూ వస్తోంది. 2024గాను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిరును దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. దీంతో మెగాభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరైన వ్యక్తికి సరైన సమయంలో దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఒక సామాన్య మధ్య తరగతి నుంచి తెలుగు సినీ రంగంలో తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఈయన కెరీర్ విషయానికొస్తే.. స్వయంకృషి, స్వీయప్రతిభే చిరు కెరీర్ కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత.బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మేరు నగధీరుడు. ఆశేష అభిమానులకు మెగాస్టార్ చిరంజీవిగా అభిమానుల గుండెల్లో కొలువైనాడు.

చిరు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మిస్సైల్ లా దూసుకువచ్చి..అదే వేగంతో మెగాస్టార్ ఎదిగారు. టాలీవుడ్ మూవీ పొటెన్షియాలిటీని పెంచిన బిగ్‌బాస్. స్టార్ ఇమేజ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన కథానాయకుడు. నటుడిగా 150పైగా చిత్రాలు చేసారు. అంతేకాదు సినీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే..రాజకీయబాట పట్టాడు.ఎమ్మెల్యే అయ్యాడు. ఆపై రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పాలిటిక్స్‌ను ఒదలిపెట్టి సినిమాలే లోకంగా బతుకున్నాడు.  

చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి స్టార్ హీరోల తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. చిరు జీవితం వడ్డించిన విస్తరి కాదు. మొదట్లో కొన్ని ఒడిదుడికులు..మరెన్నో విమర్శలు..ఆ తర్వాత ఆయన సినీ పరిశ్రమలో వచ్చిన ఒక్కోఅవకాశాన్ని వైకుంఠపాళి అనే సినీ పరిశ్రమలో పాము నోటికి చిక్కకుండా జాగ్రత్తగా నిచ్చెనలు ఎక్కి  టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగాడు.

చిరంజీవి 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో జన్మించారు. ఆయన తల్లి అంజనాదేవి, తండ్రి వెంకట్రావు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. సినిమాలపై ఆసక్తితో చిత్రరంగంలో అడుగుపెట్టిన చిరంజీవి..1978లో పునాదిరాళ్లతో ఆర్టిస్ట్‌గా  తొలిసారి ఈ మూవీతోనే ముఖానికి రంగేసుకున్నాడు.కానీ విడుదలైన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు.

కెరీర్ తొలినాళ్లలో ఇదికథకాదు, మోసగాడు, 47 రోజులు వంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ వేసి మెప్పించాడు. అటు హీరోగా నటిస్తూనే,విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసి..అన్నిరకాల పాత్రలను చేయగలనని నిరూపించుకున్నాడు. ఇది కథ కాదు సినిమా సమయంలోనే దర్శకుడు బాలచందర్.. రజినీలోని స్టైల్.. కమల్ నటన కలిపితే చిరంజీవి అనడం విశేషం. అది అక్షరాల నిజమైంది.

చిరంజీవికి జనరల్ ఆడియన్స్ లో క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం అతని డాన్స్,ఫైట్స్ ఈ రెండే అతన్ని మాస్ కి దగ్గరయ్యేలా చేసింది.
చిరంజీవి కి మాస్ లో తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం ఖైది. ఈ సినిమాతో చిరంజీవి స్టార్ హీరో అయ్యాడు. ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ష న్ లో వచ్చిన ఈ మూవీ తెలుగు సినిమా పొటెన్షియాలిటీని పెంచింది. ఇక చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలొచ్చాయి.

ఇక చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో 23 చిత్రాలొచ్చాయి. న్యాయంకావాలి సినిమాతో ప్రారంభమైన వీరి కాంబినేషన్..'ముఠామేస్త్రీ' సినిమా వరకు కొనసాగింది. వీరి కాంబినేషన్ తెలుగు సినిమాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది. కేవలం మాస్ చిత్రాలకే పరిమితం కాకుండా..మధ్యతరగతి జీవితాలకు సంబందించిన చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. సెంటిమెంట్ టచ్ వున్న పాత్రలను ధరించి అందరి మన్ననలు అందుకున్నాడు. శుభలేక, మగమహారాజు, అభిలాష, మంచుపల్లకి, రుద్రవీణ, స్వయంకృషి,ఆపద్భాందవుడు వంటి చిత్రాలు ఆర్టిస్ట్‌గా చిరంజీవికి క్లాస్ ఆడియన్స్‌లో మంచిపేరు తీసుకొచ్చాయి.

అక్కినేని,ఎన్టీఆర్ తర్వాత తెలుగులో ఎక్కువగా నవలా చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన ఘనత చిరంజీవిదే. ఇక మెగాస్టార్‌తో ఎక్కువ చిత్రాల్లో హీరోయిన్ నటించిన ఖ్యాతి నటి రాధికకు దక్కుతుంది. ఆ తర్వాత రాధ, విజయశాంతి, మాధవి, భానుప్రియ వంటి హీరోయిన్లు చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించారు.ఇక మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి చిరంజీవి ఎప్పడు ముందుండే వారు. తన ముందు తరం హీరోలైన..ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు,కృష్ణంరాజు వంటి హీరోలతో కలిసి నటించాడు. ఇక తన సమాకాలికులైన రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ బాబు,రాజశేఖర్ వంటి అగ్ర హీరోలతో ఎలాంటి బేషజాలు లేకుండా కలిసి నటించాడు చిరంజీవి.ఇక తన తర్వాతి తరం హీరోలైన రవితేజ, శ్రీకాంత్,పవన్ కళ్యాన్, శర్వానంద్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో కలిసి నటించాడు. ఇలా అన్ని తరాల హీరోలతో నటించిన ఘనత మెగాస్టార్ కు దక్కుతుంది.

ఇక ఆయన ఫ్యామిలీ విషయానికొస్తే..

1980లో చిరంజీవి అల్లురామలింగయ్య కూతురు సురేఖను వివాహమాడారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు రామ్ చరణ్. ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరో. ఇక చిరంజీవి సోదరులు నాగబాబు నిర్మాతగా,నటుడిగా..పవన్‌కళ్యాణ్ హీరోగా నిర్మాతగా ఒక వెలుగు వెలుగుతున్నారు.మెగాస్టార్‌లో యాక్షన్ హీరోనే కాదు. మంచి కామెడీ ఆర్టిస్ట్ ఉన్నాడు.జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేసిన చంటబ్బాయ్ అతనిలోని హాస్యనటున్ని ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇక తరువాత అనేక యాఓన్ చిత్రాల్లో తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన ఘనత చిరుకు దక్కుతుంది.

ఇమేజ్ పెరిగే కొద్ది చిరంజీవి తన చిత్రాల ఎంపికలో ఎన్నోజాగ్రత్తలు తీసుకున్నాడు. కేవలం మాస్ మసాలా చిత్రాలకు పరిమితం కాకుండా..ఠాగూర్,స్టాలిన్ వంటి సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ టచ్ ఇస్తూ చేసిన సినిమాలు ఆయన రేంజ్ ను మరింత పెంచాయి.
కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా..తన చిరంజీవి చారిటబుల్ ద్వారా నేత్రదానం,రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. చిరులో ఉన్న సేవా దృక్పథమే ఆయన్ని రాజకీయాల వైపు నడిపించింది. 2008 ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 18స్థానాలతో సరిపెట్టుకున్నాడు.

2009 ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేసారు చిరంజీవి. తన మామ సొంతూరు అయిన పాలకొల్లులో చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమిపాలైయ్యారు. ఆ తరవాత తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసాడు. ఆ త ర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున 2012లో  రాజ్యసభ కు ఎంపికయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కేంద్రమంత్రి వర్గంలో పర్యాటక శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున ఏపీలో ప్రచారం నిర్వహించిన ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో చిరు క్రమంగా రాజకీయాల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం సినిమాలే లోకంగా బతుకుతున్నారు.

రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన 2016లో ముఖానికి రంగేసుకున్నారు. 2017 సంక్రాంతికి కానుగా విడుదలైన 'ఖైదీ నంబర్ 150' మూవీతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. తన సినీ రంగంలో తను ఎప్పటికే మెగాస్టార్ అన్న విషయం ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చెప్పాయి. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య,గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో పలకరించారు. ఇందులో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. త్వరలో విశ్వంభర సినిమాతో పలకరించనున్నారు చిరు.

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

ఇక నటుడిగా ఉంటూనే 1998 అక్టోబర్ 2న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. ముఖ్యంగా రక్త దానం, నేత్ర దానంతో పాటు కోవిడ్ సమయంలో ఎన్నో సినీ రంగానికి చెందిన కార్మికులతో పాటు మాములు ప్రజలకు సేవలు అందించారు.

తాజాగా కేంద్రం చిరును దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌవరించింది. గతంలో 2006లో కేంద్రం చిరును పద్మభూషణ్ అవార్డు వరించింది. 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌తో గౌరవించింది.ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తమ నటుడిగా 3 నంది అవార్డులు.. 2016లో రఘపుతి వెంకయ్యనాయుడు పురస్కారంతో గౌరవించాయి. ఇక 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు సహా పలు అవార్డులు వరించాయి.  మొత్తంగా చిరు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు దక్కించుకోవాలని కోరుకుందాం.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More