Home> ఏపీ
Advertisement

గవర్నర్‌పై విరుచుకుపడ్డ ఏపీ మంత్రులు

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై ఏపీ మంత్రులు విమర్శలు చేశారు.

గవర్నర్‌పై విరుచుకుపడ్డ ఏపీ మంత్రులు

అమరావతి: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై ఏపీ మంత్రి జవహర్ విమర్శలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెదేపాని బలహీనపర్చేలా కేంద్రానికి గవర్నర్‌ తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు. నరసింహన్ ఏపీలో భాజాపా అజెండా అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. ఆలయాల చుట్టూ తిరిగే గవర్నర్ ఏపీ సమస్యలపై ఎప్పుడూ స్పందించలేదని అన్న ఆయన.. నరసింహన్ గవర్నర్‌గా కొనసాగటానికి అనర్హుడని అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వెనుక గవర్నర్ ఉన్నారని స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

మరో మంత్రి ఆనంద్ బాబు మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌ వేదికగా తెలుగు రాష్ట్రాలలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైకాపా,జనసేన, బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చింది గవర్నరే అని ఆరోపించారు. మొదటి నుంచి గవర్నర్ తీరు వివాదాస్పదంగానే ఉందని, రాజధాని, పోలవరంపై కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆనందబాబు వ్యాఖ్యానించారు.

ఏపీ శాసనమండలి విప్ షరీఫ్‌ కూడా గవర్నర్ నరసింహన్ తీరుపై పెదవి విరిచారు. గవర్నర్ నరసింహన్ తీరు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందని అన్నారు. గవర్నర్‌ పదవిని కాపాడుకునేందుకు ఆయన బీజేపీ తొత్తుగా మారారని.. టీడీపీపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారని మండిపడ్డారు.

Read More