Home> ఏపీ
Advertisement

తాడిపత్రిలో హై టెన్షన్.. రంగంలో దిగిన ఆక్టోపస్ బలగాలు

తాడిపత్రిలో హై టెన్షన్.. రంగంలో దిగిన ఆక్టోపస్ బలగాలు

తాడిపత్రిలో హై టెన్షన్.. రంగంలో దిగిన ఆక్టోపస్ బలగాలు

తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానైంది. చిన్నపొలమడ గ్రామస్థులు, ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకుల మధ్య వివాదం, అల్లర్లు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. శనివారం చోటుచేసుకున్న ఈ గొడవ సోమవారానికి కూడా చల్లారలేదు. ఆదివారం గ్రామంలోకి జేసీ దివాకర్ రెడ్డి రావడంతో పరిస్థితి విషమించింది.

సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు తాడిపత్రి ఘటనపై ఆరా తీశారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఉపయోగించే ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. కలెక్టర్, పోలీసు అధికారులతో మాట్లాడిన సీఎం.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చాల్సింది పోయి.. ఆయనే ఒక వర్గం తరఫున వకాల్తా పుచ్చుకొని ధర్నాకు దిగడంపై సీఎం కోపగించుకున్నట్లు సమాచారం.

శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో 2,000 మందికిపైగా పోలీసులను ఆశ్రమం వద్ద మొహరించారు. అక్టోపస్ బలగాలు కూడా ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. నిర్వాహకులు ఆశ్రమం నుండి బయటకు రాకపోతే ఆపరేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఆశ్రమం ఖాళీ చేయాలని అధికారుల చెప్పినా ఆశ్రమ నిర్వాహకులు సరిగా స్పందించలేదని సమాచారం. ఇక ఆశ్రమాన్ని ఖాళీచేసే సమయంలో కాల్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆశ్రమంలో టియర్ గ్యాస్ వదిలి శిష్యులను బయటకి తరలించాలని పోలీసులు ఆలోచిస్తున్నారు.

కాగా ఆశ్రమ నిర్వాహకులు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని సోమవారం కలవగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్‌గా ఉంది తాడిపత్రిలో.

అటు మరోపక్క జేసీ ప్రబోధానంద ఆశ్రమం ఎదుటే ధర్నాను కొనసాగిస్తున్నారు. ప్రబోధానందతో తమకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. అసాంఘిక కార్యకలాపాలకు ఆశ్రమం అడ్డాగా మారిందని మండిపడ్డారు. శనివారం అల్లర్లలో రెండు ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు తగలబడగా.. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఇరు వర్గాలు పెట్రోల్ బాటిళ్లు విసురుకొని దాడికి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.

Read More