Home> ఏపీ
Advertisement

నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 20 వేల ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందనున్నాయి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు అందించింది చంద్రబాబు ప్రభుత్వం.

నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 20 వేల ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందనున్నాయి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు అందించింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు వెల్లడించారు. వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అంశంపై టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం స్పష్టత ఇచ్చారని తెలిపారు. భేటీ అనంతరం మాట్లాడిన కళా వెంకట్రావు.. తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఉక్కు దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తయినందున జులై 16న గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

కాగా త్వరలో భర్తీ చేయనున్న 20 వేల ఉద్యోగాల పోస్టుల్లో గ్రూప్‌-1, 2తోపాటు పోలీస్, విద్య, వైద్య రంగాల్లోని క్షేత్ర స్థాయి ఉద్యోగాలున్నాయని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో  పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వీటికి ఈ 20 వేల ఉద్యోగాలు అదనం. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 4.83 లక్షల పోస్టుల్లో 77,737 ఖాళీగా ఉన్నాయి. ఇందులో అత్యధికం డ్రైవర్లు, టైపిస్ట్‌-కం-అసిస్టెంట్‌ పోస్టులే అధికంగా ఉన్నాయి. అయితే అవసరానికి తగ్గట్లుగానే నియామకాలు జరపాలని ప్రభుత్వం భావించింది. అందువల్ల ముందుగా 20 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల కోసం 11వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకరించిందని మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో చెప్పారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. అధికారుల పనితీరుకు అనుగుణంగానే పోస్టింగులు ఉంటాయని చెప్పారు. రెండంకెల ఆర్థిక అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని.. నాలుగేళ్లలో గణనీయమైన గ్రామీణాభివృద్ధిని సాధించామన్నారు.

Read More